Yamudiki Mogudu : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కెరీర్ ప్రారంభంలో చిన్నా చితకా పాత్రల్లో నటించారు చిరంజీవి. ఆ తరవాత తనకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని హీరోగా తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి మంచి కథ అంశాలు కలిగి ఉన్న చిత్రాల్లో నటించాడు. అలా చిరంజీవి నటించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా చిరంజీవితో పాటూ ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చింది.
సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో చిరంజీవి మరియు సుధాకర్ రూమ్ మేట్స్ అన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. అయితే అప్పటి వరకూ విలన్ పాత్రలు చేసిన సుధాకర్ యముడికి మొగుడు సినిమాలో కమెడియన్ గా నటించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మ్యానరిజంతో సుధాకర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. ఈ సినిమా తరవాత సుధాకర్ టాలీవుడ్ లో స్టార్ కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా యముడికి మొగుడు సినిమా నిర్మాతల్లో సుధాకర్ కూడా ఒకరు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన విజయశాంతి మరియు రాధా హీరోయిన్స్ గా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాల్ రావు, గొల్లపూడి మారుతీ రావు, హరి ప్రసాద్, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ వంటి వారి ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ సినిమాకు రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించారు. అప్పటిలో ఈ సినిమా ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో అందం విందోళం.. అధరం తాంబూలం.., వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మో పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తరవాత కోటి టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతకుముందు చిన్న సినిమాలకు మ్యూజిక్ అందించిన కోటికి ఈ సినిమాతోనే లైఫ్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాతోనే చిరంజీవి మరో ఇద్దరు మిత్రలు నారాయణరావు, హరిప్రసాద్ లకు కూడా లైఫ్ వచ్చింది. ఈ సినిమాకు చిరుతో పాటూ సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు, సుధాకర్ కలిసి డైనమిక్ మూవీమేకర్స్ అనే బ్యానర్ ప్రారంభించారు. సొంత బ్యానర్ లో యముడికి మొగుడు సినిమాను నిర్మించి 1988 లో విడుదల చేసి ఘనవిజయాన్ని అందుకున్నారు. యముడికి మొగుడు చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి, నిర్మాతగా, కమెడియన్ గా సుధాకర్ కి, నటులుగా హరి ప్రసాద్, నారాయణలకు మంచి గుర్తింపు వచ్చింది.