బద్వేలులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగనన్న స్మా ర్ట్ సిటీ కోసం అధికారు లు దళితుల భూములను తీసుకున్నారు. ఇంత వరకూ ఎలాంటి నష్ట పరి హారం, ప్రత్యామ్నాయం చూపకపోగా పనులు ప్రారం భిస్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై టైర్లు, కంచెలు వేసి బైఠాయించారు.ఎలాంటి ప్రత్యా మ్నాం చూపకుండా పనులు ఎలా మొదలుపెడతారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదగొట్టే ప్రయ త్నం చేయగా దళితులు, మహిళలు వారిని వారించారు.
తమ భూములు అధికార పార్టీ నాయకులకు కేటాయిస్తే సహించేది లేదని దళితులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో జగనన్న స్మార్ట్ సిటీ భూములను చదును చేసేందుకు అధికారులు పూనుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గోపవరానికి చెందిన మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత వక్కల సుబ్బరాయుడుతోపాటు పలువురిని ఆదివారం అరెస్టు చేసి బి.కోడూరులని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దళితులు బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారిలోని మడకలవారిపల్లెలో రోడ్డుపై బైఠాయించారు. తమ భూములు వేరేవారికి ఇవ్వమని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు.
ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు దళితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఓ మహిళ పోలీస్ కాలర్ పట్టుకుంది. పరిస్థితి ఉద్రికత్తంగా మారుతున్న నేపథ్యంలో ఆందోళనకారులతో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె వద్ద అన్నమయ్య అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (అడా) ఆధ్వర్యంలో జగనన్న స్మార్ట్‌సిటీ నిర్మిస్తున్నారు.