Janasena : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ గేమ్ ఛేంజర్‌గా మారడంతో కూటమి భారీ విజయంతో గెలుపొందిందని అందరికి తెలిసిందే. అయితే టీడీపీ ఎక్కువ స్థానాలలో పోటీ చేయడం వలన ఆ పార్టీ నుండే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ను పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.
అయితే అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్‌తో సహ ఇతర జనసేన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు తెలుగు దినపత్రికలలో కనిపించడమే తగ్గింది. ఆగస్ట్ 15న గ్రామ కమిటీల సమావేశాలకి సంబంధించిన వార్తలతో పవన్ పేరు పత్రికలో కనిపించింది. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ల పేర్లు మచ్చుకకి కూడా కనిపించడం లేదు. 21 మంది శాసన సభ్యుల బలం ఉన్న జనసేనకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాయలసీమ, దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ.. వారిని పక్కన పెట్టారనే వాదనలు అప్పుడే వెలువడుతున్నాయి. ఈ ప్రాంత జనసేన నాయకుల్లో అసంతృప్తి రాజుకుందంటూ వార్తలు వస్తోన్నాయి.
జనసేనకు మరో పదవిని ఆఫర్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నా దానిపై క్లారిటీ రావడం లేదు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ సమాచారాన్ని జనసేన అగ్రనాయకత్వానికి అందించారని, ఈ పదవి కోసం పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలకి సంబంధించి పెద్దగా ఎలివేషన్ ఇవ్వట్లేదు. మెల్లగా వారిని సైడ్‌కి జరిపే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది. సీఎం సమీక్షలకి ఇచ్చే ఎలివేషన్ పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టిన చేయడం లేదు. దీంతో జనసైనికులు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు.