MS Dhoni : వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికీ తన పూర్ ఫామ్‌ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ ఆడుతున్న జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది విండీస్ టీమ్. ఈ మ్యాచ్ లో అజేయ శతకంతో అదరగొట్టాడు విండీస్ కెప్టెన్ షై హోప్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, దిగ్గజం వీవీ రిచర్డ్స్ సరసన చేరాడు. ఇదిలా ఉండగా తన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన పూర్తి క్రెడిట్ ఇచ్చాడు. అతని సలహా వల్లనే ఇలా ఆడగలిగానని ఆయన చెప్పుకురావడం విశేషం.
దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలిపెట్టి దాదాపు నాలుగేళ్లు అయినా క్రికెట్ ప్రపంచంలో అతని పేరు ఏదో ఒక రకంగా మారుమ్రోగుతూనే ఉంది. ఆఖరి ఓవర్లలో ధోని అసాధ్యమైన ఆటతో మ్యాచ్‌ని గెలిపించడం చాలా సార్లు చూసాం. అయితే ఇప్పుడు ఆఖరి వరకు తాను క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించడానికి ధోనీ చెప్పిన సలహానే కారణమని అన్నాడు వెస్టిండీస్ ఆటగాడు షై హోప్.ఆదివారం తొలి మ్యాచ్ ఇంగ్లండ్, విండీస్ మధ్య జరిగింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (71), క్రాలే (48), సాల్ట్ (45) రాణించారు. విండీస్ బౌలర్లో షెఫార్డ్, మొటెయ్, ఒషానె థామస్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం భారీ ఛేదనకు దిగిన వెస్టిండీస్ 48.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కెప్టెన్ హోప్ అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 83 బంతుల్లోనే 109 పరుగులు చేసిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టి తాను కూల్‌గా బ్యాటింగ్ చేసి గెలిపించాడు. అయితే అవార్డు అందుకున్న అనంతరం హోప్ తన సూపర్ ఇన్నింగ్స్‌కు ధోనీ పరోక్ష కారణమని వివరించాడు. ”గతంలో ధోనీతో ఒకసారి మాట్లాడాను. క్రీజులో ఎంతసేపు ఉండాలని భావిస్తావో దానికంటే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించమని చెప్పాడు. ఆ సలహాతోనే ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచి విజయం సాధించాం” అని ధోనీ గురించి హోప్ మాట్లాడాడు. ఇదే ఉత్సాహంతో రెండో వన్డేలోనూ ఆడి సిరీస్‌ను సాధిస్తామని హోప్ అన్నాడు. మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లు జారవిడిచామని, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాడు.