Vizianagaram Train Accident : ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. రీసెంట్‌గా విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, సుమారు యాభై మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు. మృతుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా, ఇంకా ఇరవై మందికి పైగా క్షతగాత్రులు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనకు గల కారణాల పై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది కేంద్రం.సిగ్నలింగ్ సమస్య వల్ల ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరింది. ఈ ప్రమాదం గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందంటున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొన్నట్లు చెబుతున్నారు. ఒకే ట్రాక్‌లో సిగ్నల్ క్రాస్ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రధానంగా సిగ్నలింగ్ విషయంలో ఏర్పడిన సమస్యే ప్రధానంగా కారణం అంటున్నారు.ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్‌లోకి వచ్చినట్లు భావిస్తున్నారు.
హైటెన్షన్ వైర్లు తెగిపడటంవల్ల ఘటన జరిగితే.. ఆ సమాచారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పలాస ప్యాసింజర్ లోనే జనరల్ బోగి, దాని వెనుక ఉన్న దివ్యాంగుల భోగి, దానికి అనుసంధానంగా ఉన్న గార్డ్ బోగి అక్కడికక్కడే బోల్తా పడి భారీ ప్రమాదానికి గురయ్యాయి. అదే నేపథ్యంలో పలాస ప్యాసింజర్ ను వెనుక నుండి ఢీకొన్న రాయగడ ప్యాసింజర్ ఇంజన్ తో పాటు డి4 భోగి కూడా పూర్తిగా ధ్వంసం అయ్యి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్ లోకో పైలెట్ మధుసూదన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో ఫైలెట్ మధుసూధనరావు మృతి చెందటంతో ప్రమాదానికి గల కారణాలు తెలియటం అధికారులకు కష్టంగా మారింది. అయితే ప్రధానంగా ప్రమాదానికి ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థే కారణమని అంటున్నారు నిపుణులు.