Virat Kohli : సినీ సెలబ్రిటీలపైనే కాకుండా రాజకీయ నాయకులు, క్రీడాకారుల బయోపిక్స్ కూడా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందబోతుందనే ప్రచారం నడుస్తుంది. భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నాడని, గేమ్ ఛేంజర్ తరువాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇదివరకు ఇండియాటుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నప్పుడు కూడా రామ్ చరణ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‌పై ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. కాగా, విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
కోహ్లీ బయోపిక్ కోసం ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడన్న టాక్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా ప్రకటన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 5వ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్‌లోనే టాప్‌లో ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట. ఇందుకోసం భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలిసింది. అటు కోహ్లీకి, ఇటు చరణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో.. దాదాపు పది భాషల్లో రూపొందించబోతున్నట్లు సమాచారం.
18 ఏళ్లకే తండ్రిని కోల్పోవడం, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని నేరుగా రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడం, కెప్టెన్‌గా 2008 అండర్ 19 వరల్డ్ కప్ విజయం, అదే ఏడాది టీమిండియాలో చోటు దక్కించుకోవడం… టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఫెయిల్యూర్‌తో టీమ్‌లో చోటు కోల్పోవడం, అదిరిపోయే కమ్‌బ్యాక్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, టీమిండియా వైస్ కెప్టెన్సీ, టెస్టు కెప్టెన్సీ, 2014 ఇంగ్లాండ్ టూర్‌లో అట్టర్ ఫ్లాప్, ఆ తర్వాతి టూర్‌లో సెంచరీల మోత, లవ్ ఎఫైర్స్, అనుష్క శర్మతో ప్రేమ, పెళ్లి.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా రికార్డు, అగ్రెసివ్ యాటిట్యూడ్, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవ,కెప్టెన్సీ కోల్పోవడం… ఫామ్ కోల్పోయి మూడేళ్లు సెంచరీ లేకుండా గడిపేయడం, టీమ్‌లో చోటు ఇవ్వడమే దండగ అనే విమర్శలు.. ఆసియా కప్ 2022 సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం.. ఇలా విరాట్ కోహ్లీ జీవితంకి సంబంధించి అనేక అంశాలని సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం.