Vijaya Shanthi : బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి అలియాస్ రాములమ్మ సంచలన ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఆమె తొలిసారి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది.. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం, పాతమిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితేనే ఆ పార్టీలోకి వెళ్లానని వివరించారు. కానీ వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈటల రాజేందర్‌తో పాటు బండి సంజయ్ మార్పు, బీజేపీ పతనం లాంటి అంశాలపై కీలక కామెంట్లు చేశారు విజయశాంతి.
ఈటల రాజేందర్ మీద విజయశాంతి పరోక్ష విమర్శలు చేశారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచే కీలక నేతలంతా పార్టీని వీడారని.. అప్పటి నుంచే పతనం మొదలైందని చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని మార్చాలంటూ ఢిల్లీకి వెళ్లి చాలా సార్లు ఫిర్యాదులు చేసినట్టుగా ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం తర్వాత బండి సంజయ్‌ను మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ… కేసీఆర్ అవినీతిపరుడని చెప్పారని, అలాగే మోదీ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయని, అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ పార్టీ కార్యకర్తలను, నాయకులను మోసం చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌ని మార్చవద్దని నాలుగు నెలల ముందు చెప్పానని, కానీ పట్టించుకోలేదన్నారు. బండి సంజయ్‌ని మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ నాటిన ఓ విత్తనం… బీజేపీలో బండి సంజయ్‌ని మార్చేసిందన్నారు.బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి? ఇందుకు సంబంధించిన కేసు ఏమయింది? ఆలోచించాలన్నారు. బీజేపీని వాళ్లకు వాళ్లే నాశనం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాములమ్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.