Vijaya Sai Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు. మొన్నంతా చంద్రబాబు అరెస్ట్, విచారణ సాగగా… నిన్నంతా విజయవాడ ఏసిబి కోర్టులో వాదనలు సాగాయి. సుదీర్ఘ విచారణ అనంతరం టిడిపి హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర వుందన్న సిఐడి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఉంచారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు ఆయన గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయం మరింత హీటెక్కిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి పని చేసినప్పుడు లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సైతం చోటు చేసుకుందని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు భారీ మోసానికి పాల్పడ్డారనేది సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా నిర్ధారించారని గుర్తు చేశారు.
ఏ కుట్ర చేసినా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకోవచ్చనే భావనలో చంద్రబాబు ఉన్నాడని చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్న విషయం ఈ రోజు అర్ధమై ఉంటుందని అన్నారు. చట్టానికి అందరూ లోబడి పని చేయవల్సిందేనని చంద్రబాబు మీద ఈ ఒక్క కేసే కాదు ఇంకా ఏడు కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఎలాగోలా వ్యవస్థలను మేనేజ్ చేసాడు ఇక ఇప్పుడు కుదరదని ఈ కేసులో చంద్రబాబుకు తప్పకుండా పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తర్వాత రామోజికి కూడా జైలు శిక్ష తప్పదని అన్నారు. ఇన్నాళ్లు తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాడు శిక్షను అనుభవించక తప్పదని, దీనికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయనీ పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.