Vijaya Sai Reddy : ఏపీ ఎన్నికలలో వైసీపీ ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ జతకట్టారని, పొత్తులతోనే ఆయన విజయం సాధించారని అన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్ పై దాడులు జరుగుతున్నాయని పోలీసులు పట్టించుకోవం లేదని చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో ఏదైనా బిల్లు పాస్ అవడానికి వస్తే.. ఆ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే తాము మద్దతిస్తామన్నారు. ప్రత్యేకంగా తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని..ఏ నిర్ణయం అయినా రాష్ట్ర ప్రయోజనాల మేరకే ఉంటుందన్నారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయని జాతీయ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన దాని కన్నా ఇరవై మంది లోక్ సభ సభ్యులు ఎక్కువే ఉన్నప్పటికీ ముంద జాగ్రత్తగా మరింత మంది లోక్ సభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీ బిల్లుల వారీగా మద్దతిస్తామని చెప్పడం.. తమ ఉద్దేశాన్ని బీజేపీ హైకమాండ్‌కు పంపడమేనని అంటున్నారు. లోక్ సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.
ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ, రాజ్యసభ విషయానికొచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపైనా అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంఖ్యాపరంగా టీడీపీతో మేం దాదాపు సమానంగానే ఉన్నాం” అని విజయసాయిరెడ్డి వివరించారు..టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేరని.. పదహారు మంది లోక్ సభ సభ్యులున్నారని.. తమకు నలుగురు లోక్‌సభ ఎంపీలు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బిల్లులపై తమ నిర్ణయాలు ఉంటాయని, వైసీపీ దేశభక్తి కలిగిన పార్టీ అని చెప్పారు విజయసాయిరెడ్డి. అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిస్తాం కానీ, తమ మద్దతు బీజేపీకి కాదని అన్నారు విజయసాయిరెడ్డి.