Vijay Devarakonda : టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. రీసెంట్‌గా వచ్చిన లైగర్ తో బిగ్గెస్ట్ హిట్ కొడతాడని అందరూ భావించగా, అది ఘోరంగా దెబ్బ తీసింది. నిర్మాతలకు దారుణమైన నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ పెద్ద మనసు చేసుకొని తన రెమ్యునరేషన్‌లో ఆరు కోట్ల రూపాయలని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడట. ఆయన మంచి మనస్సుపై అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందిన లైగర్ ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. సినిమా టాక్ పరంగానే కాక కమర్షియల్ గాను డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా తెరకెక్కించడానికి రెమ్యూనరేషన్లతో కలిపి సుమారుగా రూ.100 కోట్ల బడ్జెట్ అయింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే బడ్జెట్ రికవరీ చేయడం కూడా దాదాపు అసాధ్యంగా చెబుతున్నారు.
ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండ.. చార్మి కౌర్, పూరి జగన్నాథ్ సహా ఈ సినిమా నిర్మాతలకు అండగా నిలబడాలని తన రెమ్యునరేషన్ లో సింహభాగాన్ని వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. నిర్మాతల మీద ఆర్థిక ఒత్తిడి తగ్గించేందుకే విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. లైగర్ మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. లైగర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా.. విడుదల తర్వాత సీన్ మారిపోయింది. ఈ మూవీ విడుదలకు ముందు రూ.200 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్‌దేవరకొండ ఆశలు తలకిందులయ్యాయి.