Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. అయితే.. విజయవాడలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించగా… టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రాధా… పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. “జై లోకేశ్, జై రాధా” అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
లోకేశ్ రాకతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముందుకు సాగుతుండగా, గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగింది . పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఏకధాటిగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో నిన్న షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా ముగిసింది. ఇప్పటి వరకూ 2,525 కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ విపక్ష టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ ఎప్పుడో ఖరారు చేసిన నేపథ్యంలో తనకు టికెట్ కావాలని కోరుతూ చివరి ప్రయత్నాలు చేసిన యార్లగడ్డ.. అవి కాస్తా సఫలం కాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన యార్లగడ్డ ఇవాళ లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధిగా యార్లగడ్డ పోటీ చేయడం ఖాయమైంది.