USA Vs PAK : జూన్ 2 నుండి పురుషుల టి20 ప్రపంచకప్ క్రికెట్ పోటీ మొదలు కాగా, ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. గురువారం టెక్సాస్‌లో జరిగిన మ్యాచ్‌లో జగజ్జేత పాకిస్తాన్, పసికూన అమెరికా తలపడగా, ఇందులో అమెరికా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. టీ20ల్లో మేం తోపులు అని చెప్పుకునే పాకిస్థాన్ జట్టు పసికూన చేతిలో ఓడిపోవడాన్ని ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్నారు. అమెరికా మేటి వీరులైన పాకిస్తాన్ బ్యాటర్లకి ముచ్చెమటు పట్టించడం విశేషం. అమెరికా బౌలర్ల ధాటికి అసలు బ్యాటింగ్ ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి పాక్‌కి వచ్చింది. తొలుత పాక్ బ్యాటింగ్ చేయగా, పవర్‌ప్లేలో పాకిస్తాన్ స్కోరు 30 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. బాబర్ ఆజమ్ (44) ఒక్కడే ఆచితూచి ఆడుతూ టి20ని టెస్ట్మ్యాచ్లా మార్చేసాడు.
ఇక రిజ్వాన్(9), ఉస్మాన్‌ఖాన్(3), ఫఖర్ జమాన్(11), ఆజంఖాన్(0)లు ఇలా వచ్చి అలా వెళ్ఆరు. చివరలో షాదాబ్ ఖాన్(25 బంతుల్లో 40 పరుగులు) ఎడాపెడా బాదడంతో జట్టు స్కోరు వంద దాటింది. ఇక అఫ్రిదీ కూడా బ్యాట్ ఝళిపించడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో కెంజిగే 3 వికెట్లతో రాణించగా, సౌరభ్ నేత్రావల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 160 పరుగుల లక్ష్యంతో అమెరికా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ మోనాంక్ పటేల్, స్టీవెన్ టేలర్(12)లు తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన ఆండ్రీస్ గౌస్(35)తో కలిసి మోనాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్థసెంచరీ సాధించిన మోనాంక్(50) మహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో ఔటవ్వగా, తొలి మ్యాచ్‌లో దంచికొట్టిన ఆరొన్ జోన్స్(36), నితీశ్ కుమార్(14)లు మరో వికెట్ పడకుండా సరిగ్గా 159 పరుగులు చేసారు.
రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడారు.సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లయ తప్పి ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నాడు. ఇక సూపర్ ఓవర్ ఛేదనలో 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. అయితే ఇంత దారుణంగా ఓడిపోవడంతో . దాయాది జట్టుపై ఆ దేశ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా చేతిలో పాక్ ఓడిపోవడం దారుణం అని, నీళ్లు లేని బావిలో దూకండి అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.