Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వాఖ్యాతగా ఆహా ఓటీటీలో ఇదివరకు ప్రసారం అయిన అన్ స్టాపబుల్ టాక్ షో మంచి విజయం సాధించింది. బాలకృష్ణ తనదైన స్టైల్ లో సరదాగా సెలబ్రిటీలను ఇంటర్య్వూ చేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అన్ స్టాపబుల్ 2వ సీజన్ రాబోతుంది. ఇది ఇంకా సరదాగా, చలాకీగా బాగా అలరించేలా ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా ఈ షో 2వ సీజన్ ట్రైలర్ ను విడుదల చేశారు. మోర్ డేర్ మోర్ ఫైర్ అంటూ ట్రైలర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ లతో ఈ షో ఎలా ఉండబోతుందనేది చెప్పారు. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అనే ట్యాగ్ లైన్ డైలాగ్ ను ఇప్పుడు కూడా కొనసాగించాడు. ట్రెజర్ హంట్ థీమ్ లో తీసిన ట్రైలర్ లో బాలకృష్ణ కొత్త గెటప్ లో కనిపించాడు. ఎంత కష్టమైనా సెలబ్రీటీల గురించి నిధి లాంటి విషయాలను తెలుసుకోవడమే ఈ షో ఉద్ధేశం అని చెప్పకనే చెప్పాడు. ఎటువంటి దాపరికాలు లేకుండా గొప్పవాళ్ల జీవితాల్లో వారు అన్ స్టాపబుల్ గా మారే క్రమంలో జరిగిన సంగతులను తెలుసుకునే విధంగా సరదాగా మసాలా అంశాలతో కూడుకొని ఉంటుందని చెప్పారు. బాలయ్య అభిమానులను, ప్రేక్షకులను మరింత ఎక్కువగా అలరిస్తుందని అంటున్నారు.
ఇక రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో మొదటి గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు రానున్నాడని వినిపిస్తోంది. ఇలా జరిగితే షో కి గొప్ప ఆరంభం లభిస్తుందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ సీజన్ లో పాల్గొంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే షో సూపర్ హిట్ అవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ షో ప్రారంభ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.