Thummala Nageshwar Rao : టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. ఇక మురళీ మోహన్ అభిమానులు పెద్దయెత్తున హాజరై ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డు అని, అది కొందరికే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతి బతికున్నంతకాలం వినబడే వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ప్రశంసించారు. మురళీ మోహన్ 350 సినిమాల్లో నటించారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ తప్పకుండా ప్రచారం చేసేవారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడి ప్రజలకు సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. మురళీమోహన్ మనసుపెట్టి ఏ పనైనా చేస్తాడని ప్రశంసించారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
కార్యక్రమంలో 50 మురళిలతో కూడిన దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకి మురళీమోహన్ ఒక కారును బహుమతిగా అందజేశారు. అయితే తుమ్మల ఈ కార్యక్రమంలో చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూజ్యులు, నా ఉన్నతికి తోడ్పడి నన్ను ఇంత వాడిని చేసి ఇప్పుడు మంత్రిగా మీ ముందు ఉంచింది బాబుగారే అని అన్నారు.ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రం హైదరాబాద్ కే తలమానికంగా నిలిచాయన్నారు . హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మార్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.