Short Film : ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎంత రంజుగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ రాజకీయం మరింత రంజుగా మారుస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలెంత నష్టపోయారో చూపుతూ తెలుగుదేశం రూపొందించిన ‘దివాకరం’ షార్డ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. “ది క్యాషియర్” అనే ట్యాగ్‌తో విడుదలైన ఈ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అయిదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
‘ది క్యాషియర్’ అనే ట్యాగ్‌లైన్‌తో 8 నిమిషాల నిడివిగల ఈ వీడియో వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అజయ్ అమృత్, అనిల్ దర్శకత్వంలో హేమంత్ ప్రధాన పాత్రధారిగా నటించగా హాస్యనటుడు నారాయణస్వామి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శనివారం విడుదలైన వీడియో సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు దాటిందని వారు వివరించారు. బ్యాంకు క్యాషియర్‌గా పని చేసే దివాకరం అందరికీ ఉచితంగా డబ్బు ఇస్తున్నారంటూ వెంకీ బృందం డప్పులతో ప్రచారం చేస్తుంది. దీంతో గ్రామస్థులంతా బ్యాంకు దగ్గరకు పరుగు తీయడంతో చిత్రం ప్రారంభం అవుతుంది. తాను ఎవరికీ ఉచితంగా డబ్బు ఇవ్వలేదని, వెంకీ అనే వ్యక్తి తన డబ్బు తానే డ్రా చేసుకుని తీసుకెళ్లాడని దివాకరం చెబుతాడు. గ్రామస్థులంతా వెంకీ దగ్గరకెళ్లి ‘నీ డబ్బు నీకిచ్చిన దివాకరానికి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తారు. దీంతో అతను ‘అమ్మఒడి రైతు భరోసా, ఆటోడ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు వేసినప్పుడు మీరు జగన్‌కు పాలాభిషేకాలు చేశారు కదా? ఆ డబ్బు ఏమైనా సాక్షి మీడియా , భారతీ సిమెంట్, లోటస్‌పాండ్ ప్యాలెస్ అమ్మేసి ఇచ్చిన డబ్బులా? మరెందుకు పాలాభిషేకం చేశారు?’ అంటూ నిగ్గదీయడంతో వారికి నోటమాట రాదు.
అభివృద్ధి చేయడం రాదు, రాజధాని కట్టలేరు, పోలవరం పూర్తి చేయలేరు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు. అలాంటి వారికి ఓటెలా వేస్తార్రా’ అని కథానాయకుడి పాత్రధారి వేసే ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘ఈ మాత్రం బటన్ నొక్కడానికి బామ్మ చాలదా? సీఎం అనేవారు ఒకరు కావాలా?’ అంటూ ముక్తాయించారు. ఇది ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది.