IPL Players : ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు కొందరు ఆటగాళ్ల ఆటతీరుని బట్టి భారీ మొత్తం చెల్లించి పలువురు ఆటగాళ్లని దక్కించుకుంటూ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్-2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ ఖజానాలో నుంచి అత్యధిక మొత్తాన్ని నలుగురి ఆటగాళ్లపై వెచ్చించారు. వారు తొలి మ్యాచ్‌లో దారుణంగా నిరాశపరిచారు. ముందుగా ముంబై ఆటగాడు కామెరాన్ గ్రీన్ కోసం ముంబై రూ. 17.5 కోట్లు ఖర్చు చేయగా, ఆయన తన తొలి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపొయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఐపీఎల్ అరంగేట్రం చేసిన గ్రీన్ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. అటు బౌలింగ్‌లో రెండు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.
ఇక ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేయగా, అతను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రాజస్థాన్‌పై 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇంగ్లాండ్ కి చెందిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను చెన్నై కొనుగోలు చేసింది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఈ ఫ్రాంచైజీ.. సదరు ఆటగాడి కోసం రూ. 16.25 కోట్లు ఖర్చు చేసింది. అయితే తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మంచి ప్రదర్శన ప్రదర్శిస్తాడని అందరు భావించగా, స్టోక్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేశాడు. బౌలింగ్ లో పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు.
ఇక ఈ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కర్రన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. అయితే అతను గ్రీన్, స్టోక్స్, బ్రూక్ కన్నా కూడా మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాట్‌తో 26 పరుగులు.. బంతితో 38 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే కాస్ట్‌లీ ఆటగాళ్లిన పేరొందిన వీరు రానున్న మ్యాచ్‌లలో ఎంతగా రాణిస్తారో చూడాలి.