Thatikonda Rajaiah : బీఆర్ఎస్‌లో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు రంజుగా మారుతున్నాయి. టికెట్లు రాని వాళ్లు తలోదారి వెతుక్కుంటుండగా, ఇందులో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిస్థితే కొంత అయోమయంగా ఉంది. నిన్నటి వరకు కేసీఆర్ చెప్పినంటూ వింటా అని.. ఇప్పుడేమో రేపోమాపో నేను అనుకున్నది కార్యక్రమం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరునూరైన ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు.ధర్మసాగర్ మండలంలో బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
దుక్కి దున్ని, నారు పోసి, కలుపుతీసి, పంట పండించి, కుప్ప పోశాక.. ఆ కుప్ప మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటూ ప్రశ్నించారు. పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారన్న రాజయ్య.. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.అయితే రాజయ్య మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన తీరు చూస్తుంటే రాజయ్య జంప్ అయ్యేట్టుగా కనిపిస్తున్నాడని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం బీఆర్ ఎస్ లోనే ఉండితీరుతాడని చెబుతున్నారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ టికెట్ కేటాయించడంతో రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే టికెట్ రాలేదన్న బాధతో మొన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్య.. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆవేదనతో చెప్పారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన అభిమానులందరూ సంయమనం పాటించాలంటూనే కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే.. ఉన్న కొన్ని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.