TDP : ఏపీ పాలిటిక్స్ ఎంత రంజుగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ ప్రచారం నుండి మొదలు రిజల్ట్స్, ప్రభుత్వం ఏర్పాటు అంత కూడా రక్తి కట్టించాయి.సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ,మున్సిపాలిటీల్లో కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈక్రమంలోనే వైసీపీ పాగా వేసిన మున్సిపాలిటీలపై టీడీపీ కన్నేసింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పోరేటర్లకు టీడీపీ కండువా కప్పడం జరిగింది.సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి చెందిన 24 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్లు తాము టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ, పలువురు వైసీపీ కార్పోరేటర్లను తమ పార్టీలో చేర్చుకుంది.
రెండు రోజుల క్రితం ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. బాలయ్య సొంత నియోజకవర్గంలో హిందూపురంలో కూడా పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ తోపాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులైన తర్వాత… వైసీపీకి భవిష్యత్ లేదని ఆ పార్టీకి చెందిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు టీడీపీతో టచ్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, పుంగనూరు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీకి బైబై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ రెండు చోట్ల టీడీపీ జెండా రెపరెపలాడుతోంది.
ఇక ఒంగోలు కార్పొరేషన్, హిందూపురం మున్సిపాలిటీలూ టీడీపీ ఖాతాలో చేరిపోయినట్లే… సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో విభేదిస్తూ వైసీపీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు. దీంతో కార్పొరేషన్‌లో పసుపు జెండా ఎగరేశారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీ కూడా పసుపు మయమైంది. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయి ఆధిపత్యం చూపిన హిందూపురంలో ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. దీంతో మున్సిపల్ చైర్మన్‌తో సహా 10 మంది కౌన్సిలర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు.ప్రభుత్వం మారడంతో ఆయా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్లు అంతా తమ అనుచరులను వెంటబెట్టుకుని టీడీపీలో చేరతామంటూ రాయబారాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లలో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి ఏ మాత్రం ఆపే ప్రయత్నం చేయలేకపోవడం, పార్టీ నేతలు అంతా నియోజకవర్గాల స్థాయిలో సైలెంట్ అయిపోయారు. దాంతో ఎవరు ఏమిటో అర్ధం కాని పరిస్థితి.