Surya Kumar Yadav : ప్రస్తుతం టీ 20 ప్రపంచ కప్ హోరా హోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇండియా సెమీస్‌కి చేరింది. సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. అయితే ఇండియా సెమీస్‌కి చేరుకోవడంతో కోహ్లీ తో పాటు సూర్యకుమార్ యాదవ్ పాత్ర కూడా ఉంది. ఆయన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్ కూడా ఒకటి. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టీ 20 వరల్డ్ కప్ 2022 లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతూ, మంచి స్కోర్లు నమోదు చేస్తున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతను ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 225 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 75 కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచ కప్‌లో 193 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. జింబాబ్వేపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో తుఫాను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 25 బంతుల్లో 61 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చివరి ఐదు ఓవర్లలో శివతాండవం చేశాడు.

సూర్య సునామి ఇన్నింగ్స్‌కి ముందు జింబావ్వేకి అద్భుతమైన అవకాశం దక్కింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ముజారబానీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి స్కూప్ షాట్ ఆడబోగా, అది మిస్ కావడంతో బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. అయితే ముజారబానీకి బంతి బ్యాట్ ని తగిలినట్టు అనిపించగా,చిన్న అప్పీల్ చేశాడు. కీపర్ కూడా తగలలేదన్నట్టే ఉండడంతో అంపైర్ కూడా స్పందించలేదు. కానీ రీప్లేలో మాత్రం బంతి.. బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. వారి అమాయకత్వంతో సూర్య ఔట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకోవడంతో చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు పిండుకున్నాడు.