Srikanth : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలే తప్ప సినీ పరిశ్రమపై కాదు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో ఆయనపై కొందరు వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. పకోడిగాళ్లు అంటూ కొడాలి నాని పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేశారనే చర్చ జరిగింది. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమాన సంఘాలు గుడివాడలో ఆందోళనకు దిగాయి. పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. అయితే నాని మాత్రం చిరంజీవి అభిమాన ముసుగులో టీడీపీ , జనసేన పార్టీ వాళ్లు ఇలా రాద్దాంతం చేశారని ఆరోపిస్తున్నారు.
అయితే చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హీరో శ్రీకాంత్.. చిరంజీవిపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి అన్నయ్యని చూశాం ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన ఎంతో మందికి సేవ చేశారు. ఎవరికి ఏ నాడు హనీ తలపెట్టలేదు. ఆయనని చూసే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్, వైష్ణవ్ ఇలా అందరు వచ్చారు. ఆయనని ఎవరైన ఏమన్నా అనాలంటే వారి వెనక మేమందరం అన్నామంటూ స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చారు శ్రీకాంత్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు తినిపించారు. తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని నాని ఛాలెంజ్ చేశారు. తాను శ్రీరామ అన్నా సరే టీడీపీ, జనసేన పార్టీలకు బూతు మాటలుగా వినపడతాయన్నారు. తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసని.. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారన్నారు.