Sr NTR : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా నటుడిగా ఉంటూ తెలగు దేశం పార్టీ ( టీడీపీ) అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రేసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు .ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. కాషాయం దుస్తుల్లోనే కనిపించారు. ఆయన కాషాయ దుస్తులు వేసుకోవడం వెనక పెద్ద కథే ఉంది.
తిరుపతిలో జరిగిన ఓ సినిమా అవార్డ్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్…తొలిసారి కాషాయ వేషధారణతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎందుకు అలా వచ్చారో అడిగే ధైర్యం ఎవరు చేయలేదు. అయితే ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత విలేకరులు కొంత మంది ఆయన కాషాయ ఆహార్యంపై ప్రశ్నించారు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఓ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. అందుకే ఈ కాషాయ వేషధారణ అంటూ చెప్పుకొచ్చారు. ప్రాపంచిక సుఖాలకు అలవాటు పడకూడదని నిర్ణయించుకున్నా అని అందుకే ఈ గెటప్ అని చెప్పారు.
ముక్కుపచ్చలారని చిన్నారిని చెరిచిన ఘటన తనను కలచివేసిందని జీవితం పట్ల విరక్తి పుట్టిందని కూడా ఎన్టీఆర్ తెలిపారు. స్వామి అగ్నివేష్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, ఆయన దగ్గర నుండి కాషాయం గొప్పతనం తెలుసుకున్నారట. అప్పటి నుండి ఎన్టీఆర్ కాషాయ దుస్తులలో ఎక్కువగా కనిపించే వారు. కాగా, స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ.. సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మన కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాలనే తపన మనలో మొదలవుతుందని ఎన్టీఆర్‌తో చెప్పారట.