Sadguru Jaggi Vasudev : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇటీవల జరిగిన మహా శివరాత్రి వేడుకలలో చాలా సంతోషంగా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. డ్యాన్స్‌లు చేస్తూ తెగ సందడి చేశారు. అయితే ఇప్పుడు ఆయన బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతుండడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది. తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గీ వాసుదేవ్ ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించినట్లు అపోలో ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు.
గత 4 వారాలుగా సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని తెలిపారు. సద్గురు మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సీటీ స్కాన్‌లో వెల్లడైందని ఈ క్రమంలోనే నెలరోజులుగా ఆయనకు తీవ్ర తలనొప్పి ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాల కారణంగా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు. అయితే తలనొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 15 వ తేదీన సద్గురు తనకు కాల్ చేశారని.. అప్పుడే ఏదో తీవ్రమైన సమస్య ఉందని తనకు అర్థం అయిందని డాక్టర్ వినీత్ సూరి చెప్పారు.
పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. 17న ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీటీ స్కాన్ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు సైతం ఉన్నట్లు తేలింది. దీంతో ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్ సూరీ, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్ విజయవంతమైందని.. ఆయనకు బాగా కోలుకుంటున్నారని నరసింహన్ సోషల్ మీడియా పోస్టులో వివరించారు.మరో వైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆసుపత్రిలో జగ్గీ వాసుదేవ్ కోలుకుంటున్నారని తెలిపింది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.వాసుదేవ్‌కి ప్రధాని మోదీ కాల్ చేసిన ఆయన బాగోగుల గురించి కనుకున్నారు.