Roja : విశాఖపట్నంలోని రుషికొండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కి వైసీపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. బోడి వెధవలు అంతా కూడా బోడి ప్రచారం చేయడం ప్యాషన్‌గా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రుషికొండ వద్ద హడావుడి చేశాడని.. అక్కడ ఏం లోపాలు ఉన్నాయో, ఏం అక్రమాలు జరుగుతున్నాయో చెప్పు అంటే చెప్పడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ ఏమైనా సుప్రీం కోర్టు కన్నా గొప్పొడా అని ప్రశ్నించారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉందని.. అక్కడ చేసేనిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ద్వారా అందజేస్తుందని చెప్పారు. కోర్టు చిన్న చిన్న మార్పులు సూచిస్తే వాటిని పాటిస్తున్నామని రోజా చెప్పుకొచ్చారు.
కొండల మీద కట్టడం వల్ల పర్యావరణం ధ్వంసం అవుతుందని పవన్ భావిస్తే.. రుషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయని , ఇంకా అనేక నిర్మాణాలు కొండల మీదనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. కొండ మీద ఈ కట్టడాలు పవన్‌కు కనిపించడం లేదా?.. ఆయన కళ్లు ఏమైనా కల్యాణ్ జూవెల్లర్స్‌లో తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాన్ మాట్లాడినట్టుగా కొండల మీద కట్టడం తప్పే అయితే.. ఆయనది, ఆయన అన్నయ్యది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొండల మీదే ఉంది కదా? అని అన్నారు. అన్ని అనుమతులతోనే రుషికొండపై నిర్మాణాలు చేపడుతున్నామని రోజా తెలిపారు. ‘‘జగన్ ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడని మాట్లాడుతున్నాడు.. నువ్వెవడివి, నువ్వు ఎవడివిరా’’ అంటూ రోజా తీవ్ర పదజాలంతో విమర్శించారు.
చంద్రబాబు, పవన్‌లు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులని విమర్శించారు. సీఎం జగన్ ఒక్కసారి కళ్లు గట్టిగా తెరిచి చూస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు. అలాంటి పనులు జగన్ చేయడు కాబట్టే.. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ ఎమ్మెల్యే కాలేదని.. పార్టీ ఒక్కడు కూడా లేడని.. అలాంటిది ఎలా ప్రతిపక్ష నాయకుడివి అని చెప్పుకుంటావని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సొంత డబ్బులతో తాడేపల్లిలో ఇళ్లు కట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అక్కడే నాలుగుళ్లుగా ఉంటున్నారు. అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబును తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.