Roja : సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ పై రోజా దారుణమైన విమర్శలు చేసింది. పిచ్చి ముదిరిందని, పీకే అంటే అర్థం పిచ్చి కల్యాణ్ అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఆరోగ్యశ్రీ ద్వారా పవన్ పిచ్చికి వైద్యం చేయిస్తామన్నారు. అవాకులు చెవాకులు పేలితే పవన్ అయినా, ఇంకెవరైనా పళ్లు రాలగొడతానని హెచ్చరించారామె. జనసేన మీటింగ్ లో పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రోజా. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి, సీఎం జగన్ ని విమర్శించడమా అని అన్నారామె. సీఎం జగన్ ను పట్టుకుని నీ బతుకెంత అని పవన్ అడుగుతాడా అంటూ రోజా ఫైర్ అయ్యారు.
2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 151 మంది మద్దతుతో జగన్ సీఎం అయ్యారని గుర్తు చేసారు. 22 మంది ఎంపీలను తన జెండా, అజెండాతో గెలిపించారని రోజా చెప్పుకొచ్చారు. నీ సొంత అన్ననే గెలిపించుకోలేకపోయిన పవన్ ను ప్రజలు నీవెంత నీబతుకెంత అని అడుగుతున్నారని రోజా పేర్కొన్నారు. ప్రజలకు ఇఛ్చిన మాట కోసం దేశాన్నే గడగడలాడించిన సోనియా నే ఎదుర్కొన్న నేత జగన్ అని రోజా వివరించారు. తల్లిని తిట్టిన వాడితో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్ అని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 82 శాతం సీట్లతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్ అని రోజా చెప్పుకొచ్చారు.
జనసేన 136 స్థానాల్లో నిలబడితే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయని గుర్తు చేసారు. జగన్ పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చేస్తే 5.43 లక్షల ఓట్ల మెజార్టీతో రికార్డు సాధించారని గుర్తు చేసారు. జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిన పవన్ గురించి అందరూ ప్రశ్నిస్తున్నారని రోజా పేర్కొన్నారు. 12 ఏళ్లు పార్టీగా నడిపిస్తున్న దమ్మున్న నేత జగన్ గా రోజా వివరించారు. పవన్ తన జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలాడని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయిన, ఎవడికైనా పళ్లు రాలగొడతామని రోజా హెచ్చరించారు. సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ ఓ పెద్ద దొంగగా మంత్రి రోజా అన్నారు. పదే పదే నువ్వెంత నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అంటూ పవన్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించింది.