Roja : ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో నారా లోకేష్ అరెస్ట్ కూడా జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి, భువనేశ్వరి జోరు పెంచారు. వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా.. చంద్రబాబు, లోకేష్ సహా భువనేశ్వరి, బ్రహ్మణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ రాష్ట్రపతిని కలిసిన అంశంపైనా మంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ ఏనాడూ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని.. తప్పు చేసిన తన తండ్రిని కాపాడుకోవడానికి మాత్రం కలిశారని సెటైర్ వేశరు. లోకేష్ ఢిల్లీలో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తెగ తిరుగుతున్నాడని.. కానీ, అడ్డంగా దొరికిన నారా చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కనీసం లోకేష్ కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవద్దా అంటూ పర్యాటక శాఖ మంత్రి మండిపడ్డారు.
భువనేశ్వరి, బ్రాహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని మండిపడ్డారు. 6 నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్ లో రాసుకుంటానని బెదిరిస్తున్న నారా లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు ఉంచుకోవాలని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారని.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా అని ఆర్కే రోజా నిలదీశారు.