Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2024ను గెలుచుకున్న టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఇప్పటి నుండే తీవ్ర కసరత్తులు చేస్తుంది. రీసెంట్‌గా శ్రీలంక పర్యటనలోని మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా దారుణంగా పరాజయం పాలైంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని గంభీర్ పట్టుబట్టాడు. కానీ ఈ సిరీస్‌లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. . తొలి మ్యాచ్‌ను టై చేసుకున్న భారత్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత భారత్‌పై వన్డే సిరీస్ గెలిచింది.
ఎన్నో అంచనాలతో కోచ్‌గా బాధ్యతల చేపట్టిన గంభీర్.. తొలి వన్డే సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరచడం ఎవరికి మింగుడు పడడం లేదు. కోచ్‌గా అతను తీసుకున్న నిర్ణయాలు టీమిండియా కొంపముంచాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘోర పరాజయంతో టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పటిష్టమైన టీమిండియాను గౌతమ్ గంభీర్ నాశనం చేశాడని మరోవైపు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ..ఈ సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయలేదని అంగీకరించిన రోహిత్ శర్మ.. ఈ ఓటమితో ప్రపంచం ఏం అంతం కాదని అసహనం వ్యక్తం చేశాడు. తమ జట్టులోని ఆటగాళ్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారని, ఈ ఓటమితో బాధపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
‘స్పిన్ ఆడటంలో భారత్ బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గేమ్ ప్లాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్‌లో మేం ఒత్తిడికి గురైన మాట వాస్తవం. టీ20 ప్రపంచకప్ విజయంతో మేం ఏం రిలాక్స్ అవ్వలేదు. ఇదో పెద్ద జోక్. భారత్‌కు ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే. శ్రీలంక మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కండిషన్స్‌కు తగ్గట్లు మేం కాంబినేషన్‌ను మార్చాము. ఈ సిరీస్‌లో మేం మెరుగైన ఆటతీరు కనబర్చలేదు. అందుకే ఓటమిపాలయ్యాం. సానుకూలంశాల కంటే లోపాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పిన్ కండిషన్స్‌లో మేం ఎక్కడ తప్పిదాలు చేశామో చర్చించుకుంటాం. ఈ ఓటమి నుండి మేము ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యం అని రోహిత్ అన్నారు.