RK Roja : ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారుతుంది.వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన రోజా ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ఇందులో శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చినట్లు చెప్పారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని , అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత సైతం ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య కేసును రీఓపెన్ చేయిస్తామని తెలిపారు. అలాగే టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై సమీక్ష చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా.. తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో మంత్రి పదవిని కొట్టేశారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఓ వెలుగు వెలిగారు. వేదికలపై డ్యాన్సులు, పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ నిత్యం వార్తల్లో నిలిచేవారు.ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ క్రీడా ఉత్సవాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై ఆత్యా పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. విజయవాడలో సీఐడీ అధికారులను కలిసి ఫిర్యాదు పత్రం అందించారు.
ఫిర్యాదు అనంతరం ఆర్డీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నాటి క్రీడల శాఖ మంత్రి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేక అకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ అక్రమాలపై విచారణ చేయాలని సీఐడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హయాంలో శాప్ ఎండీలు, ఆ శాఖ ఉన్నత అధికారులు, డీఎస్‌డీఓలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. క్రీడా శాఖకు సంబంధించి అన్ని ఫైళ్లను పరిశీలించాలని కోరారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు.. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు.