Revanth Reddy : ఈ సారి తెలంగాణ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపు గుర్రం ఎవరిది అనేది రేపు తెలియనుంది. ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోగా, ఇందులో సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయితే పోలింగ్ రోజు నాగార్జున సాగర వ్యవహారం తెరపైకి రాడం అందరిని ఆశ్చర్యపరచింది. నాగార్జున సాగర్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ఇది కేవలం వ్యూహాత్మకమైన చర్యగా అభివర్ణించారు. నాగార్జున సాగర్ ఎక్కడికీపోదు, ఆ గేట్లు ఎక్కడికీ పోవు, నీళ్లు అక్కడే ఉంటాయని వివరించారు.
తెల్లవారు ఝామున పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఇలాంటి అంశాలకు తెర లేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో సంయమనం పాటించాలని కోరారు. ఇప్పుడు ఎవరు, ఎందుకు, ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. దీనిపై ఎన్నికల అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు.తమ ప్రభుత్వం తప్పక వస్తుందని ఆప్పుడు దీనిపై సరైన పరిష్కారం చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
![Revanth Reddy : ఇవన్నీ చిల్లర కథలు.. నాగార్జున సాగర్ వ్యవహారంపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి Revanth Reddy sensational comments on nagarjuna sagar dam](http://3.0.182.119/wp-content/uploads/2023/12/revanth-reddy.jpg)
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్ళకు సంబంధించి ఏ రాష్ట్ర సమస్యనైనా పరిష్కరిస్తామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను ఊటంకించారు. ఈ నీటి సమస్యను సామరస్య పూర్వకంగా ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండేలా పరిష్కరించుకుంటామన్నారు. పాకిస్తాన్, భారత్‌లే నీటిని పంచుకుంటున్నాయని రెండు దేశాలే నీటి విషయంలో సామరస్యంగా పోతుంటే రాష్ట్రాలు నీటిని పంచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పై అక్రమంగా చొరబడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముళ్ల కంచెను బుధవారంనాడు రాత్రిఏర్పాటు చేశారు. డ్యామ్ 13వ గేటు వద్దకు చేరుకుని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.