Ramyakrishna : బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు వరుసగా మహిళా నాయకులు, సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ వంటి వారు ఇప్పటికే బండారుపై సీరియస్ కాగా, ఇప్పుడు తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నటి రమ్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల సినీ నటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణమని మండిపడ్డారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ దుయ్యబట్టారు.
మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మన దేశం ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోందని.. అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు రమ్యకృష్ణ. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్‌తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు ఖండించాలని రమ్యకృష్ణ అన్నారు. తాను మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానన్నారు.
ఈ దేశంలో మహిళలపై రేప్‌లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరమని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం బండారు వ్యాఖ్యలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రోజా, రమ్యకృష్ణ సినిమాల్లో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.