Ram Gopal Varma : ఎప్పుడు సంచలన చిత్రాలు తీసే రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే చిత్రాన్ని తీసాడు. ఆయన ఈ సినిమాని డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ‘వ్యూహం’, ‘శపథం చిత్రాల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని ‘వ్యూహం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వాస్తవానికి నవంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు వర్మ తెలిపారు. డిసెంబర్ 29న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ‘వ్యూహం’ సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను షేర్ చేశారు. ఈ చిత్రంలో జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్, వైఎస్ భారతి పాత్రను మానస రామకృష్ణ పోషించారు. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విడుదలకి దగ్గర అవుతున్న నేపథ్యంలో వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసక్తిర విషయాలు తెలియజేశారు. సెన్సార్ అడ్డంకులతో మా వ్యూహం సినిమా ఆగిపోయినప్పుడే చెప్పాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే.. మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని. ఇవాళ అదే జరిగింది. అందుకే ఫస్ట్ టైమ్ సెన్సార్ సర్టిఫికెట్ తో పోస్టర్ డిజైన్ చేయించాం.
ఈ నెల 29న గ్రాండ్ గా వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వాటికి చంద్రబాబు, పవన్ రియల్ లైఫ్‌కు సంబంధం లేదు. ఈ వ్యూహం కథలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుండి మొదలై జగన్ అరెస్ట్, ఆయన పార్టీ పెట్టి సీఎం అవడం, వైఎస్ వివేక హత్య వంటి అనేక ముఖ్య సంఘటనలు ఉంటాయి. సినిమా అంటే డ్రామా కాబట్టి ఆ ఘటనలన్నీ డ్రమటిక్‌గా సినిమా చూసే ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాను.ఈ చిత్రం ఒక పొలిటికల్ డ్రామా.వైఎస్సాఆర్ చనిపోయిన దగ్గర నుండి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. రసగుల్లా కంటే కూడా చంద్రబాబు అంటేనే నాకు ఇష్టం అంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.