Raghunandan Rao : తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న దుబ్బాకలో కారు జోరు చూపించిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి బలమైన నాయకులు బరిలో ఉండగా.. భారత రాష్ట్ర సమితికి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డినే (మెదక్ ఎంపీ) విజయం వరించింది. ఈయన 53,513 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించడం విశేషం. త్రిముఖ పోరు ఉంటుందనుకున్నప్పటికీ.. ప్రతి రౌండ్‌లోనూ కొత్త ప్రభాకర్ రెడ్డి.. భారీ ఆధిక్యంతో స్పష్టమైన మెజార్టీ సాధించారు. దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాజపాకు చెందిన రఘునందన్ రావు ఈసారి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రచారం సమయంలో ఊహించని రీతిలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తిదాడి అంశం.. ఒక్కసారిగా సమీకరణాలు మార్చేసింది అని చెప్పాలి. ఈ దాడి అంశం కాంగ్రెస్, బీజేపీలపై ప్రభావం చూపినట్లే తెలుస్తోంది. కొత్త ప్రభాకర్‌కు సింపథీ ఓట్లు తీసుకొచ్చి పెట్టిందని అనుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ మీటింగ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రఘునందన్ రావు ఖండించారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటిన స్థానాలు గెలుచుకుందని, ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ, ఎంఐఎం పార్టీలను కలుపుకొని ఏర్పాటవుతుందనటం పట్ల భారతీయ జనతా పార్టీకు ఎలాంటి సంబంధ లేదన్నారు. ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ అంటకాగితే… తమకు సంబంధం లేదన్నారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీతో అంటకాగే.. ఏ పార్టీతోనూ బీజేపీ కలవదు భవిష్యత్‌లోనూ కలవబోదని.. రఘునందన్ రావు స్పష్టం చేశారు.