Prashant Kishore : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రచ్చగా మారాయో చూశాం. ఎవరు గెలుస్తారు అనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే వీటిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. మరోసారి స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదు అని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఓట్ల లెక్కింపులో ఓ నాలుగు రౌండ్లు పూర్తయ్యాక.. ఆధిక్యం రాకపోతే ఓడిపోతున్నట్లు ఒప్పుకుంటారనీ.. కానీ.. ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదు అని వైసీపీని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి 2019లో వచ్చిన సీట్లకు సమానంగా కానీ లేదా.. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చెబుతుంటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. 151కిపైగా ఎమ్మెల్యేసీట్లు.. 22 వరకు ఎంపీ సీట్లు ఖాయమన్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ నేతలు ఏకంగా జూన్ 9న సీఎం జగన్ రెండోసారి సీఎం కావడం పక్కా అంటున్నారు. అయితే జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టాపిక్ తీసుకొచ్చారు. ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన వాటికన్నా ఎక్కువగా ఉంటాయన్నారు.
సీఎం జగన్ వ్యాఖ్యల తర్వాత మరోసారి ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని జోస్యం చెప్పారు. ఓ ప్రముఖ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నట్లు సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే అటు అమిత్ షా, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ కూడా చెబుతున్నారన్నారు. తాను గత పదేళ్లు ఎన్నికల్లో పనిచేస్తున్నానని.. తనకు ఫలితాల ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని వ్యాఖ్యానించారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానిని స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.