Posani Krishnamurali : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా ఉన్నాయో తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయం మరింత వేడెక్కిస్తున్నారు. టీడీపీ , జనసేనపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతూ అగ్గి రాజేస్తున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళి..నందమూరి బాలయ్యపై షాకింగ్ కామెంట్ చేసి చర్చనీయాంశంగా మారాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు.
రామోజీ రావు ఆయన పేపర్‌తో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండటంతోనే సెలవుపై వెళ్లారని ఆయన అన్నారు. రాహుల్ సెలవుపై వెళ్లడంతో జైలుకుకొత్త అధికారి వస్తే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువు అని.. అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును జైలులో కలిసిన ఆయన సతీమణి భువనేశ్వరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె భర్త ప్రజల కోసమే పనిచేశారని చెప్పారని అన్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరింది ప్రజల కోసమేనా?, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులు పంపింది ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి చేయించింది, అక్రమంగా అధికారం లాక్కుంది చంద్రబాబు అని గుర్తులేదా? అని పోసాని ప్రశ్నించారు. మాజీ ఉన్నతాధికారి పీవీ రమేష్ బ్రోకర్.. మీడియా ముందుకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన వాటి గురించి పీవీ రమేష్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నందమూరి బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కాల్చినట్టుగా కాల్చిపారేశాడని , వారు బుల్లెట్స్ దిగి చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. పోలీసు స్టేషన్‌లో ఉండాల్సిన బాలకృష్ణకి ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. తుపాకీతో కాల్పులు జరిపి కూడా బాలకృష్ణ శిక్ష పడకుండా ఉన్నారని అన్నారు. ఇవన్నీ పీవీ రమేష్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. మరి అడ్డదారులు తొక్కింది ఎవరని పోసాని కృష్ణమురళి ఆరోపించారు.