PM Modi : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం పీఎం ఉజ్వల యోజన గురించి మనందరం వింటూనే ఉన్నాం. దారిద్య రేఖకు దిగువున ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో మోదీ ప్రభుత్వం పీఎం ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ఈ పథకం కింద లబ్ధిదారుల్లో 10 కోట్ల లబ్ధిదారు అయోధ్యకు చెందిన మీరా మాంఝీ కావడంతో శనివారం అయోధ్య పర్యటన సందర్భంగా ఆమె నివాసాన్ని ప్రధాని స్వయంగా సందర్శించారు.
ప్రధాని మోదీ స్వయంగా దళిత కుటుంబానికి రావడంతో మీరా, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బిపోయరు. సామాన్య వ్యక్తిలా ప్రధాని మోదీ తమ నివాసానికి విచ్చేయడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. మీరా మాంఝీ ఇంట్లో కొద్దిసేపు ఉన్న మోదీ..ఆమె కుటుంబ సభ్యులు, పిల్లలతో, ఇతరులతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ మీద వండటం నేర్చుకున్నావా అని మోదీ మీరాని నవ్వుతూ అడగ్గా..నేర్చుకున్నా సార్ అని మీరా చెప్పింది. ప్రధాని మోడీ అకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయి..ఆ రాముడే స్వయంగా మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోందని మోదీతో మీరా చెప్పింది. ప్రధాని రాకతో మీరా చాలా సంతోషంగా కనిపించింది.
మీరా భర్త సూరజ్, పిల్లలతో మోదీ ముచ్చటించారు. పిల్లలతో మోదీ కాసేపు సరదాగా మాట్లాడారు. ప్రధాని వచ్చి వెళ్లిన మరుసటి రోజే అంటే ఆదివారం(డిసెంబర్ 31,2023)అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ వ్యక్తిగతంగా మీరా ఇంటికి వెళ్లిన ఆమెకు ఆయుష్మాన్ కార్డును అందజేశారు. ఇక ఇదిలా ఉంటే..భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్రిక కథనం రాసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, అపార ప్రజాదరణ, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వంటి అంశాలు మోదీని మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని యూకే పత్రిక తెలిపింది.