Pilli Subhash Chandra Bose : ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై అందరి దృష్టి పడింది. ఒకవైపు వైసీపీపై జనసేన, టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ సీపీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అవసరమైతే వైఎస్ఆర్ సీపీ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, క్యాడర్ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని పిల్లి అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి తాము సీఎం జగన్‌తోనే ఉన్నామని , ఇద్దర్నీ పిలిచి సమావేశపరుస్తానని సీఎం జగన్ చెప్పారని అన్నారు. అసలు క్యారెక్టర్ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు.
![Pilli Subhash Chandra Bose : వైసీపీలో వర్గ పోరు.. ఆయనకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న పిల్లి.. Pilli Subhash Chandra Bose told he will contest independently](https://telugunews365.com/wp-content/uploads/2023/07/pilli-subhash-chandra-bose.jpg)
తన క్యాడర్‌ను మంత్రి వేణు ఇబ్బందులకు గురిచేశారన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ కచ్చితంగా సమాధానం చెప్తారన్నారు. క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని.. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు తాను చెప్పుకొచ్చానంటూ పిల్లి సుభాష్ స్పష్టం చేశారు. అయితే పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి వేణు స్పందించారు. మండలి రద్దు అవ్వదని తెలిసి బోస్‌ను… మంత్రిగా కంటిన్యూ అవుతావా అని జగన్ అడిగారన్నారు. అనుచరుల వల్లే బోస్‌కి అపకీర్తి, మచ్చ వస్తుందన్నారు. పార్టీకి నష్టం చేసే వారిని కచ్చితంగా దూరం పెడతానన్నారు మంత్రి వేణు. తల్లి లాంటి పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని.. ఓడిపోయినా బోస్‌ను వదలలేదన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి, రాజ్యసభ ఇచ్చాడని గుర్తు చేశాడు మంత్రి వేణు.