Pawan Kalyan : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు ఎంపీ సీట్లను కూడా ఈ కూటమి కైవసం చేసుకుంది. ఇక, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాన్ భారీ మెజారిటీ గెలుపొందారు జనసేన అధినేత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తన తనయుడు అకీరా నందన్‌ను ప్రధాని మోదీకి పరిచయం చేశారు పవన్. అలాగే మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించాడు అకీరా నందన్. అదే సమయంలో మోదీ అకీరా మీద చేయి వేసి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. ఆ ఫొటోలను చూసిన పవన్, జనసేన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వారసుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాదిరిగానే అకీరా కూడా ఇంట్రోవర్ట్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అకీరా కూడా టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు పవన్ కళ్యాన్, లెజినోవా దంపతలు స్వాగతం పలికారు.
ఆయనకు పుష్పగుచ్ఛం, శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న అకిరా నందన్ చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేశారు. దీంతో చంద్రబాబు.. అకిరాను ఆశీస్సులు అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే.