Pawan Kalyan Vs Roja : కత్తిపూడిలో నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలిచాక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే.. ఆయనకు ఫోన్లో చాలా మనస్పూర్తిగా అభినందనలు చెప్పి.. మీ వ్యక్తిగత జీవితం, విషయాల గురించి మాట్లాడను.. మంచి పరిపాలన ఇవ్వండి అని చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆయన మాత్రం తన ఇంట్లొ ఉన్న 4 ఏళ్ల బిడ్డను కూడా వదలకుండా తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచ్ఛం, నీచం లేకుండా తిట్టారని.. అంత తప్పు ఏమి చేశాను? ప్రజల కోసం పనిచేయడం తప్పా? అని పవన్ ప్రశ్నించారు.పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఉవ్విళ్లూరు ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలని అన్నారు.
నేను నా వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను… ఈ కూసే గాడిదలను రమ్మను…. నా వారాహిని ఆపండి… నేనేంటో అప్పుడు చూపిస్తా” అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని తనపై కక్షకట్టి పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా దమ్ముంటే అడ్డుకోవాలని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.
18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు తెచ్చుకున్న యువతకు ఒక్కటే విన్నపం.. ఒక మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష, ఆత్మ బలిదానం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనం గుర్తు ఉంచుకుని, ఆయన ఆశయాల కోసం పనిచేయాలి. నేను కేవలం సంపాదన కోసం సినిమాలు చేయడం లేదు. పార్టీని నడపడానికి డబ్బు అవసరం కాబట్టి సినిమాలు చేస్తున్నాను. సినిమా టిక్కెట్స్ విషయంలో కూడా చాలా దిగజారిన వ్యక్తి జగన్. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్లాస్ వార్ అంటే పేద, ధనిక మధ్య వ్యత్యాసం. జగన్‌తో పోలిస్తే నేను చాలా తక్కున. ఆయన మీద క్లాస్ వార్ నేను చేయాలి. వేల కోట్లు సంపాదన, మైనింగ్ కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న వ్యక్తి క్లాస్ వార్ అంటే ఎలా అని పవన్ వ్యాఖ్యానించారు.