Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కాకినాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించాడు. గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తూ పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. పోటీ చేసే అభ్యర్థి ఎవరో కాదు యువ పారిశ్రామికవేత్త, ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.
పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. రెండు ఎంపీ స్థానాల్లో ఒకటైన కాకినాడకు పార్టీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్‌ను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన అధిపతి పవన్ మాట్లాడుతూ.. ‘ఉదయ్ నా కోసం ఎంతో త్యాగం చేశాడు. అతడిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈ క్రమంలోనే పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోదీ, అమిత్ షా చెబితే అప్పుడు ఆలోచిస్తా. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడు. అప్పుడు నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా’ అని వెల్లడించారు. అయితే కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
చేబ్రోలులోని తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కల్యాణ్… ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కాకినాడ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో కాకినాడలో జనసైనికుల కోలాహలం మిన్నంటింది. ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. , మేం 2014లో ఎలా కలిసి వచ్చామో, ఇప్పుడు కూడా బలమైన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి స్వీప్ చేయబోతోంది” అంటూ పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.