ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు. విజయవాడలోని ఇరిగేషన్ భవన్‌ను డిప్యూటీ సీఎంగా, కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ క్యాలణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. అక్కడే వరుస సమీక్షలు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ సమస్యలు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పవన్ అందులో తెలిపారు.ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనానికి వెనుకాలే కోర్టుల సముదాయం ఉంది. అందుకే అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్ రాకపోకలతో ఇబ్బందిగా మారుతుందని ఫిర్యాదులు అందాయి.
పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిలిపేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లే వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన దృష్టికి వచ్చింది.ప్రజలు పడుతున్న ఇబ్బంది గమనించిన పవన్ కల్యాణ్ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. గత కొద్ది రోజులుగా పార్టీ దగ్గర ఉన్న తను బస చేసే బిల్డింగ్‌లోనే సమీక్షలు నిర్వహించారు. ఇకపై దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.