Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తొలి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ కావడంతో ఇప్పుడు రెండో విడత కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఏలూరు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గజమాలతో ఏలూరు ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు ఇన్‌ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, కొటికలపూడి గోవిందరావు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ర్యాలీగా క్రాంతి కళ్యాణ మండపంకు చేరుకున్నారు. అంతకు ముందు కృష్ణా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ జిల్లా నాయకులు చలమచెట్టి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో శనివారం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు.
![Pawan Kalyan : రోజాపై పవర్‌ఫుల్ ఎటాక్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. Pawan Kalyan talked about roja and alliance with tdp](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pawan-kalyan-3.jpg)
వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం తాను కళ్లారా చూశానని పవన్ అన్నారు. ఈ పోరాటం వృథా కాదని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూడాలంటే ఆ పార్టీ పతనం గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం కావాలని జనసేనాని చెప్పుకొచ్చారు. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు వెళితే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని తన పార్టీ శ్రేణులకి తెలియజేశారు. ఇక వైసీపీ వాళ్లు ఎంత మొరిగిన మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళదాం అని ఆయన అన్నారు.