Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ని బర్రెలక్కతో పోలుస్తూ చాలా మంది విమర్శిస్తున్నారు. తెలంగాణలో బర్రెలక్క పోటీ చేయగా, ఆమె కన్నా తక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్లకి వచ్చాయని అంటున్నారు. దానిపై తాజాగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి దిగుతామని పవన్ అన్నారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని దిశానిర్దేశం చేశారు. టిక్కెట్ ఆశపడే అభ్యర్థులు వ్యక్తిగతంగా 10 వేల నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుందని.. అలాంటి వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టంగా తెలిపారు పవన్ కళ్యాణ్.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రూ.40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని చెబుతుంటే, తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని ఎలా చెబుతానానని నాయకుల వద్ద ప్రశ్నించారు. సభలకు వచ్చిన జనం.. పోలింగ్ బూత్ దగ్గర కనిపించాలనీ.. దీనికోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధమై పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.రాబోయే ఎన్నికల్లో ప్రతి సీటు కీలకమే.. అందువల్ల ప్రతి స్థానాన్ని గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొడుతున్నామనీ చెబుతూ, తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ప్రయాణం చేసేవారికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రచార విధానాలు అవలంబించాలి.. ఎక్కడ సభలను నిర్వహించాలనే ఇతర అంశాలను నాయకులతో చర్చించారు.
2024లో జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, పదేళ్లపాటు అధికారంలో నిలిచి అద్భుతమైన ఆంధ్రాను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. “దశాబ్ద కాలంగా వైసీపీ గూండా నాయకులను బలంగా ఎదుర్కోగలుగు తున్నామంటే యువత, మహిళలే మన ప్రధాన బలమన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దిక్కు లేకుండా అయిపోయిందని రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు కుక్కలు చింపిన విస్తరి చేశారన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునరుజ్జీవం తీసుకురావాలని రాష్ట్రాన్ని గాడిలోపెట్టాలన్నారు.