Pawan Kalyan : ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.. లుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఈ సారి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. వారిద్దరూ కూడా తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో నారా లోకేష్ శాసనమండలికి నామినేట్ అయ్యారు.
పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తరువాత అసెంబ్లీలో అడుగు పెట్టారు పవన్. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో. 2014 మార్చి 10వ తేదీన జనసేన ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం- బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు గానీ ఎన్నికల బరిలో దిగలేదు పవన్ గానీ, ఆ పార్టీ అభ్యర్థులు గానీ.సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు గానీ చేదు ఫలితం ఎదురైంది. ఆ ఎన్నికల్లో ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. అయితే ఈ సారి ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో పవన్ అడుగుపెట్టగా, ఆయన తన పవర్ ఫుల్ స్పీచ్‌తో అదరగొట్టారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. ఓటమిని ధైర్యంగా స్వీకరించే దమ్ము వైసీపీకి లేదన్నారు. అందుకే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజల అయ్యన్న పాత్రుడిలో వాడీవేడి చూశారు ఇన్నాళ్లూ ఘాటైన వాగ్దాటి చూశారని అన్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని అయ్యన్నను ఉద్దేశించి కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని పవన్ తెలిపారు. భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు. భాష విద్వేషం రేపడానికి కాదని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించడానికి అని అన్నారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని అన్నారు పవన్. ఇకపై సభలో వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరతరాలకు ఆదర్శంగా నిలవాలని అందుకే స్పీకర్ కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.