Pawan Kalyan : ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. దత్తపుత్రుడు, నాలుగు పెళ్లిళ్లు అంటూ వైఎస్ జగన్.. పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. ఇక పిఠాపురంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో అయితే తీవ్రస్థాయిలో విమర్ళలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు జ్వరమొస్తే హైదరాబాద్ పారిపోతారని.. ఇలాంటి సినిమా హీరో కావాలో.. జనం కోసం పనిచేసే గీత లాంటి లోకల్ హీరోలు కావాలో తేల్చుకోవాలంటూ సెటైర్స్ వేశారు.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్.. జగన్ మీద తీవ్రవ్యాఖ్యలు చేశారు.
సినిమా హీరోలంటే వైఎస్ జగన్‌కు కుళ్లు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలంటే కుళ్లుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారని ఆరోపించారు. టికెట్ల విషయంపై మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మషేష్ బాబు, రాజమౌళి వంటి సినిమా పెద్దలు గతంలో ఒకసారి వైఎస్ జగన్ ఇంటికి వెళ్లారు. అయితే ఈ సమయంలో జగన్ వారిని అవమానించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు ఇంటికి వస్తే.. ఇంటి బయటో ఎక్కడో వాహనాలను నిలిపివేయించి.. వారిని నడిపించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే సీక్రెట్ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేశారని.. సినీ పరిశ్రమ తరుపున చిరంజీవి మాట్లాడిన వీడియోలను రిలీజ్ చేసి ఆయనను అగౌరపరిచారన్నారు.
![Pawan Kalyan : నీకు రాయి తగిలితే మా అన్న ఎందుకు స్పందించాలి.. జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు.. Pawan Kalyan sensational comments on cm ys jagan about stone](http://3.0.182.119/wp-content/uploads/2024/04/pawan-kalyan-4.jpg)
లక్షల మంది అభిమానులు తమ గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్‌కు కుళ్లు అని అందుకే ఇలా చేశారని పవన్ విమర్శించారు. ఎవరి జోలికి వెళ్లని అజాత శత్రువులాంటి చిరంజీవిని అవమానించిన వ్యక్తి జగన్ అని చెప్పిన పవన్.. ఈ విషయాన్ని అందరు హీరోల ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జగన్‌కి మేము వచ్చాక అసలు ఏంటో చూపిస్తాం. ఇక్కడ చాలా మంది హీరోల అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం వాళ్లు నన్ను ఎప్పుడు అవమానించలేదు. చిరంజీవి, ప్రభాస్, మహేష్‌ని నడిపించి వారిని ఎంత అవమానించారో చూశాం. జగన్ కక్ష పూరితమైన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో తెలియడం లేదు. చిరంజీవి గారు అందరి తరపున మాట్లాడితే ఆయనని కూడా అగౌరవపరిచారు అంటూ జగన్‌పై పవన్ ఫైర్ అయ్యారు.