Pawan Kalyan : గత కొద్ది రోజులుగా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. నేటి నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు కానుంది. పలు ప్రాంతాలలో అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుండగా, అక్కడ పవన్ ప్రసంగించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే డిసెంబర్‌లోనే ఏపీ , తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అన్నారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత ముందుకు వస్తున్నారని, తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించామన్నారు.
ప్రజల అభిమానం సంపాదించుకోవడం కష్టంతో కూడుకున్న పని, ప్రతి ఒక్కరూ ఐడెంటిటీని కాపాడుకోవాలన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ చాలా బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఆశామాషిగా రాజకీయం చేయడానికి రాలేదని అన్న ఆయన.. సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. . తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆయన నేతలకు సూచించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడలో ప్రజానీకానికి జనసేన అండగా నిలవాలని పవన్ సూచించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని.. వాళ్ల ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చాలా మంది అక్కడికి వస్తున్న నేపథ్యంలో లోకల్‌గా ఉన్నవాళ్లకి ఉద్యోగాలు దొరకడం లేదని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందకపోవడం వల్లనే ఇక్కడి వారు కూడా హైదరాబాద్‌కి తరలి వెళ్తున్నారని రానున్న రోజులలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని తెలియజేశారు పవన్.