Pawan Kalyan : పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో బ్రో అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. జూలై 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అయితే చిత్రంలో అంబటి రాంబాబు మాదిరిగా శ్యాంబాబు అనే పాత్రని క్రియేట్ చేసి ఆయనని కించపరిచారని వైసీపీ నాయకులు అంటున్నారు.అంబటి రాంబాబు కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ పవన్ పెళ్లిళ్లపై సినిమాలు చేస్తానని, అలానే బ్రో సినిమాకి నిర్మాతలు ఖర్చు పెట్టిన డబ్బులపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తానంటూ కొన్ని కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించాడు.
రాజకీయాలను నడిపేందుకు తనకు సినిమాలే ఇంధనం అని..కానీ రాజకీయాల్లోకి సినిమాలను తీసుకురావద్దని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొందరు అలా మాట్లాడుతారని ..తాను ఆ సినిమా చేసి వదిలేశానని..మీరెందుకు మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తన అభిమానులు లేదా ఇతరులు తన సినిమాలపై చర్చిస్తే పర్వాలేదు. కానీ పార్టీ అధికార ప్రతినిధులు కూడా అలా మాట్లాడితే ఎలా అని పవన్ నిలదీశారు. ఇక డిబేట్లలో పాల్గొనే వారు వైసీపీ నేతల స్థాయికి దిగజారి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. అవతలి వారు ఎక్కువగా మాట్లాడితే చెవి తిప్పినట్టు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
డిబేట్లలో వైసీపీ నేతలు చెప్పిన దానికి తల ఊపడం కాదని గట్టిగా ఎదుర్కోవాలని..పార్టీ నేతలకు పవన్ సూచించారు. మరి పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజులలో వారాహి యాత్ర మూడో విడత ప్రారంభం కానుంది. మరోవైపు ఖాళీ సమయాలలో తను కమిటైన సినిమాల షూటింగ్ పూర్తి చేయనున్నారు పవన్.