Pawan Kalyan : చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఎట్టకేలకు జైలు నుండి బయటకు రావడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షం జనసేనకు కూడా ఊరట నిచ్చింది. దీంతో జనసేన పార్టీ ఛీప్ పవన్ కళ్యాణ్ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్పందించారు.
చంద్రబాబుకు బెయిల్ లభించిందని తెలియగానే పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. చంద్రబాబు నాయుడు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో టీడీపీ, జనసేన ఇరు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇప్పటికే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన పవన్.. ఆ దిశగా ఇరు పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ , బెయిల్ గురించి సాక్షి రిపోర్టర్ పవన్ కి ప్రశ్నలు వేయగా, ఆయన స్ట్రైట్‌గా స్టన్నింగ్ సమాధానం ఇచ్చారు. 29 కేసులలో ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబుపై అభియోగం ఉందని సీఐడీనే చెప్పారు. కాబట్టి ఆయన దోషి కాదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ ప్రమేయం ఉందని తాను భావించడం లేదంటూ పవన్ స్పష్టం చేశారు.