Pawan Kalyan : మరికొద్ది రోజులలో ఏపీలో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ ప్రణాళికలు రచిస్తున్నాయి.తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బీజేపీతో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది.
జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించటంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు తగినన్ని సీట్లు రాలేదంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 సీట్ల కోసం ఇంత అవసరమా, మరీ ఇంత మంచితనం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్‌లో 24 ఎమ్మెల్యే ట్రెండ్ అయింది. అయితే 24 సీట్లు కేటాయించడంపై అసంతృప్తి వద్దంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు సూచించారు.కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దని.. విజయంలో 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
![Pawan Kalyan : 24 సీట్లు అని చెప్పగానే పవన్ రియాక్షన్ చూడండి..! Pawan Kalyan reaction after chandra babu announced 24 seats to janasena](http://3.0.182.119/wp-content/uploads/2024/02/pawan-kalyan-2.jpg)
24 అసెంబ్లీ సీట్లతో పాటు.. 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే.. మొత్తంగా రాష్ట్రం లోని 40 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు.చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 నుంచి 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం నంబర్ గానే చూడొద్దని.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవటంతో ఇంకా ఆ సస్పెన్స్ కొనసాగుతోంది.