Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కీలకంగా మారనున్నాడు. ఆయన టీడీపీతో పొత్తుపెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్న పవన్ కళ్యాణ్.. తాము అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం ఇస్తామే తప్ప ఆపేది ఉండదని వెల్లడించారు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ బీమా చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మరింత ఇస్తాం తప్ప.. ఏదీ ఆపబోమని స్పష్టం చేశారు. మరోవైపు డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో కలిసి చర్చిస్తున్నట్లు వివరించారు. తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని, అలాంటి ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతానని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన జనసేన కార్యకర్తలకు సంతాపం తెలియజేస్తున్నానన్న పవన్ కళ్యాణ్.. చిన్నవయసులోనే చాలామంది జనసేన కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల సాయం పెద్ద మొత్తమేమీ కాదన్న జనసేనాని.. మరణించిన కార్యకర్తల కుటుంబాలను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. చెక్కులు పంపిణీ చేయడం ద్వారా బాధలో ఉన్న కుటుంబాలకు భరోసా నింపాలనేదే తమ ఆలోచన అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డబ్బులు ఇవ్వటమే కాకుండా వారి పిల్లలకు చదువులు కూడా అందించాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ తొత్తు అని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనిని ఏ మాత్రం లెక్క చేయని పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా వెళ్లిపోయారు. అంటే తన మౌనం ద్వారానే షర్మిళ కామెంట్స్‌కి పవన్ సమాధానం ఇచ్చాడని అర్ధమవుతుంది.