Pawan Kalyan : ప్రస్తుతం జనసేనాని వారాహి యాత్ర నాలుగో విడతలో పలు ప్రాంతాలు తిరుగుతుండడం మనం చూస్తున్నాం. నిన్న కృష్ణా జిల్లా.. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాటపటిమ అవసరం అంటూ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ అన్నారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు.
జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం నిలపబోమని… పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం ఆగిపోదనీ.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా తమ ప్రణాళికలు ఉంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్ష అన్న పవన్ కళ్యాణ్.. అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారంగా మారుతుందని చెప్పుకొచ్చారు. “జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదు. వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నాను. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేనే స్వయంగా ప్రకటిస్తాను. నా తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదు. దొంగచాటుగా ఏ పని చేయను. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది అని అన్నారు.
నేను ఏ రోజు కూడా నా వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని మాట్లాడలేదు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆ పార్టీని తక్కువ అంచనా వేయను. టీడీపీ దగ్గర ఉన్న అనుభవానికి, జనసైనికుల యువరక్తం, పోరాట పటిమ తోడైతేనే వైసీపీని ఇంటికి పంపించగలం. చంద్రబాబు గారిపై పెట్టిన కేసులు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలవుతారని నమ్ముతున్నాను. జగన్ తన మీద 30కి పైగా కేసులు ఉన్నాయని, ఇతరుల మీద కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. . 2014లో ఏ పదవి ఆశించకుండా బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి జరగాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వ రావాలి. టీడీపీ నాయకులకు నా విన్నపం ఒక్కటే గతంలో మాట మాట అనుకున్నం మనసులో పెట్టుకోకండి. జనసేన కార్యకర్తలను ప్రేమగా పలకరించండి. మీ అనుభవానికి వాళ్ల పోరాట పటిమ తోడైతేనే వైసీపీని గద్దె దించగలం.చంద్రబాబు గారికి చాలా అనుభవం ఉంది. ఆయన ఏపీని మరింతగా అభివృద్ధి చేయగలరని భావించిన నా మద్దతు ఇచ్చాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.