Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు అందుకున్న తర్వాత ఆయన ప్రజా సేవలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు. 40 సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి అని పవన్ అభివర్ణించారు.
ఒకప్పుడు హీరో రాజ్‌కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారు… ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిస్తున్నాయన్నారు పవన్ . ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని.. అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని కర్నాటక పర్యటనలో ఉన్న పవన్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో యాక్ట్ చేసిన సినిమా పుష్ప. అయితే అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప2ని ఉద్దేశించే పవన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ స్పందించారు.
‘‘పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు’’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణ హాని కూడా కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండటంతో కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖతో చర్చలు జరిపేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు.ఆ సమయంలో ఆయన కన్నడలో కూడా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.